I

Budget 2024: ఆదాయ పన్ను పరిమితి పెంచుతారా? నిర్మలమ్మ ప్లాన్ ఏంటి?

Budget 2024: కొత్త ఎన్డీయే ప్రభుత్వం జులై చివర్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిసింది. ఐతే.. ఆదాయ పన్ను పరిమితులు పెంచుతారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. బీజేపీకి సీట్లు తగ్గాయి కాబట్టి.. మినహాయింపులు పెరగవచ్చని తెలుస్తోంది.

 

Budget 2024: ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను పరిమితులను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓ అంచనా ప్రకారం.. ఈసారి తక్కువ ఆదాయం వచ్చే వారికి పన్ను మినహాయింపులు పెంచుతారనీ, ఐతే.. సంక్షేమ పథకాల కేటాయింపుల్లో పెంపు పెద్దగా ఉండదని తెలుస్తోంది. శాలరీలు పొందేవారికి ఈ బడ్జెట్ ఎలాంటి గుడ్‌ న్యూస్ చెబుతుంది అనే దానిపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదాయ పన్ను పరిధిని 5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ప్రస్తుతం కొత్త స్లాబ్ ప్రకారం.. రూ.3 లక్షల వరకూ.. టాక్స్ నిల్ ఉంది. ఆ తర్వాత 3 నుంచి 6 లక్షల వరకూ 5 శాతం టాక్స్ ఉంటుంది. ఐతే.. 5 లక్షల వరకూ మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మినహాయింపు ఇస్తే.. కింది నుంచి పై స్థాయి వరకూ మినహాయింపులు పెరుగుతాయి. తద్వారా అన్ని ఆదాయాల వారికీ కొంత ఊరట కలుగుతుంది.

దిగువ ఆదాయ వర్గం వారికి ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఇస్తే, తద్వారా వారి చేతిలో కొంత ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయంతో వారు కొనుగోళ్లు జరుపుతారు. దాంతో వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు మనీ ఫ్లో ఉంటుంది. తద్వారా పరిశ్రమలు నడవగలవు. ఇలా ఎకానమీలో యాక్టివిటీ పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఐతే, కొత్త పన్నుల విధానంలో పన్నూ రేట్లను కూడా తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

ఆదాయ పన్ను రేట్లను మార్చడం వల్ల దిగువ, మధ్య తరగతి, ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా 15 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారికి ఊరట లభించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం 15 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారు 20 శాతం దాకా పన్ను చెల్లిస్తున్నారు. ఆదాయం 15 లక్షలు దాటిన వారు మాగ్జిమం 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సంవత్సరానికి 10 లక్షల శాలరీ పొందుతున్న వారిపై పన్ను రేట్లు తగ్గించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం వివిధ శాఖల అధికారులతో నిర్మలా సీతారామన్ చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో సీట్లు తగ్గడంతోపాటూ.. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. అందువల్ల పన్ను మినహాయింపులు పెరుగుతాయని అంతా ఆశిస్తున్నారు. మున్ముందు దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.